ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం పాలకొండ శ్రీ సంతోషిమాత!

పాలకొండ (పార్వతీపురం జిల్లా): ఆంధ్రప్రదేశములోని పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ పట్టణంలో సుమారు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానం ఉత్తరాంధ్రలో విశేష ప్రాచుర్యం పొందింది. ఆదిదేవుడైన వినాయకుడి మానస సుపుత్రికగా, పార్వతీ పరమేశ్వరుల ముద్దుల మనుమరాలిగా ప్రసన్నముఖముతో, నాలుగు భుజములతో అమ్మవారు ఇక్కడ వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు.

రూప వైభవం:

ఖడ్గమును, త్రిశూలమును, పాత్రను ధరించి, అభయ హస్తముతో సంతోషభరితమైన మనస్సు, చిరునవ్వుతో కొలువై ఉన్న జగన్మాత శ్రీ సంతోషిమాత. నెలరేఖలా శోభాయమానంగా కళలు చిందిస్తూ, కాంతులు వర్షిస్తూ దేదీప్యమానంగా నెలకొన్న చిన్నారి సంతోషిమాతగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు.

క్షేత్ర మహిమ - భక్తుల విశ్వాసం:

  • ​శ్రీ సంతోషిమాత అమ్మవారు కోరిన వారికి కొంగుబంగారమై, ఆపన్నులను కాపాడుతూ, సిరిసంపదలు కురిపించే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందారు.
  • ​స్త్రీలకు ఐదవతనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపచేసే దేవతామూర్తిగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు.
  • ​భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి అనుగ్రహాన్ని కోరుకోవడం ఇక్కడ ఆనవాయితీ.
  • ​భక్తితో సేవించిన భక్తులకు ఆయురారోగ్య భోగభాగ్యములు, సిరిసంపదలు కలుగుతున్నాయనడానికి ఎన్నో నిదర్శనములు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు.
  • ​కోరిన కోరికలు తీర్చే తల్లిగా, అన్ని వరాలిచ్చే అమ్మగా, కోటి మహిమలు గల తల్లిగా, భక్తుల పాలిట కామధేనువుగా ఈ జగన్మాత పూజలందుకొంటుంది.

నిత్యకైంకర్యాలు - ఉత్సవాలు:

శ్రీ సంతోషిమాత అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజు. ఆ రోజు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, అర్చనలు, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు, అమ్మవారి వ్రతం, ఉద్యాపనలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి శుక్రవారం ఆలయం భక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

  • పండుగలు: ఉగాది నూతన పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం వైభవంగా జరుగుతాయి.
  • శ్రావణమాసం: నెల రోజులు ప్రతినిత్యము ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు, అర్చనలు జరుగుతాయి. శ్రావణ శుక్రవారాలలో పర్వదినోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి.
  • ప్రత్యేక పూజలు: ప్రతి నెల అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం నాడు, ప్రతి నెల పౌర్ణమి నాడు మరియు ఇతర పండుగలలో ప్రత్యేక పర్వదినములలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరుగుతాయి.

ప్రార్ధనా శ్లోకాలు:

  • సంతోషిమాత గాయత్రి: "రూపా దేవ్యైశ్చ విద్మహే గణేష పుత్ర్యైశ్చ ధీమహి తన్నో నిత్యసంతోషి ప్రచోదయాత్"
  • మంత్రం: "ఓం శ్రీ ఐం క్లీం సౌః సంతోషిమాత్రే నమః"

​పాలకొండలో కొలువై ఉన్న ఈ జగన్మాత, లోక కళ్యాణార్థము వెలసి, సుమారు ఆరు దశాబ్దాల నుండి రోజురోజుకీ వైభవోపేతంగా ఆలయం అభివృద్ధి చెందుతూ, సకల సౌభాగ్యాలకు నిలయమై, భక్తుల పాలిట కల్పవృక్షమై, కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా, భక్తకోటిని పాలిస్తున్న జగన్మాతగా వెలుగొందుతున్నది.

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః

Post a Comment

0 Comments