అద్భుతం: పొలంలో బయల్పడిన పాలకొండ (అన్నవరం) శ్రీరామలింగేశ్వరస్వామి!

పాలకొండ వెబ్ న్యూస్ News by  BSS Prasad
1818లో అవధూత శ్రీ సింహాద్రి విశ్వనాధ స్వామిచే ప్రతిష్ట – అన్నవరంలో ఆధ్యాత్మిక శోభ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా ,పాలకొండ మండలం, అన్నవరం గ్రామంలో వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి వారి దేవస్థానం స్థల పురాణం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఆలయ నిర్మాణం ద్వారా ప్రతిష్టించిన శివలింగాల కంటే, స్వయంభువుగా వెలసిన లేదా భూమి నుంచి బయల్పడిన శివలింగాలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత అధికం. అటువంటి మహిమాన్విత చరిత్రే ఈ క్షేత్రానికీ ఉంది.నాగలి సాలులో వెలుగు చూసిన శివలింగం: దేవస్థానం స్థలపురాణం  ప్రకారం... సుమారు 1818వ సంవత్సరంలో ప్రస్తుత ఆలయ ప్రాంగణము ఒకప్పుడు వ్యవసాయ క్షేత్రంగా ఉండేది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం దున్నుతుండగా, నాగలి సాలువుకు ఒక శిల తగిలింది. రైతులు ఆ ప్రాంతంలో పరిశీలించగా, అద్భుతమైన ఒక శివలింగం బయల్పడింది.
అవధూతచే యంత్ర స్థాపన, ప్రతిష్ట:
ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో సంచరిస్తున్న అవధూత శ్రీ సింహాద్రి విశ్వనాధ స్వామి (శ్రీ సనార విశ్వేశ్వర స్వామి) వారికి తెలియజేశారు. వారు సదరు శివలింగమును పరిశీలించి, ఇది అత్యంత మహిమాన్వితమైన శివలింగముగా భావించారు.
శ్రీ స్వామి వారు స్వయంగా క్రీ.శ. 1818వ సంవత్సరము జ్యేష్ట శుద్ధ ఏకాదశి పవిత్ర దినాన ఈ శివలింగమును యంత్ర స్థాపన చేసి ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు శ్రీరామలింగేశ్వరస్వామి వారిని విశేషంగా దర్శించుకుంటూ, పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ దేవస్థానానికి సంబంధించిన స్థల పురాణం ఆలయ ప్రాశస్త్యాన్ని, భక్తిని పెంపొందిస్తుందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.
 

Post a Comment

0 Comments