తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల్లో శ్రీరంగం శ్రీవైష్ణవుల పాత్ర విశేషం. మూడు దశాబ్దాలకు పైగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి జరిగే వాహనసేవల్లో పాల్గొంటూ అమ్మవారి సేవలో తమను తాము అర్పించుకుంటున్నారు. తమిళనాడులోని శ్రీరంగం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన ఈ వైష్ణవ సంప్రదాయపరులు గత 35 ఏళ్లగా ఈ సేవను కొనసాగిస్తున్నారు. అమ్మవారి వాహనాలు రెండున్నర టన్నులకుపైగా బరువుండే భారీ వాహనాలు. 28 అడుగుల పొడవైన తండ్లు, అడ్డపట్టీలు, గొడుగులు, అర్చకులతో కూడిన ఈ వాహనాలను మూడు గంటలపాటు భుజస్కంధాలపై మోస్తూ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించడం పెద్ద కష్టమైన పని. అయినా భుజాలపై గాయాలు, ఉబ్బుకాయలు వచ్చినా భక్తి ముందు బాధలను తలచకుండా సేవలో తరిస్తున్నారు.
.
చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ, రైల్వే, బ్యాంకింగ్, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న 50 మందికి పైగా వైష్ణవులు, విద్యార్థులు కూడా ఈ సేవలో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల సమయం రాగానే ఉద్యోగాలకు సెలవులు పెట్టి తిరుచానూరుకు చేరుకుంటారు. వీరికి టిటిడి నుంచి బస, భోజనం, వస్త్రబహుమానం, ప్రయాణ ఖర్చులు అందించబడటం విశేషం.
వాహనం మోయేటప్పుడు శ్రీవైష్ణవులు పాటించే నడక విధానం ప్రత్యేకం. వాహనాన్ని ఒకేసారి భుజాలపైకి ఎత్తడం, సమిష్టిగా ఒక స్థలంలో దింపడం వంటి విధానాల్లో వారి ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమన్వయం వల్ల వాహనంపై అమ్మవారిని చూసే భక్తులకు కూడా ఆత్మీయత, భక్తి భావం పెరుగుతుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని భుజాలపై మోయడం పూర్వజన్మ సుకృతమని సేవకులు భావిస్తున్నారు. తమ ప్రాంత వైష్ణవులు 35 సంవత్సరాలుగా ఈ సేవలో భాగం కావడం గర్వకారణమని, అమ్మవారి కృపవల్ల తమ జీవితం సుఖసంతోషాలతో ఉందని చెబుతున్నారు.
0 Comments