పాలకొండ వెబ్ న్యూస్ (ఆధ్యాత్మిక వార్తలు): పాలకొండ మండలం, గొట్టమంగాళాపురం గ్రామం, పుణ్యనదీ తీరమైన నాగావళి ప్రవాహ ప్రాంతాన వెలసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిచే పూజలందుకున్న విశిష్టతతో పాటు ఆగమ శాస్త్రోక్తంగా చెక్కబడిన బ్రహ్మసూత్రం, సోమసూత్రాల అరుదైన ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆలయ గర్భాలయంలో వర్ణరంజిత పవిత్ర పుష్పమాలికలు, శోభాయమానమైన దివ్య అలంకరణలతో కొలువుదీరిన స్వామివారికి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు మరియు శాస్త్రోక్త అర్చనలతో నాగావళి నదీతీరం హరహర మహాదేవ నామస్మరణలతో పూజలు చేస్తున్నారు.ఉదయాన్నే పవిత్ర నాగావళి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు.
ఈ ఆలయ శివలింగంపై కొలువుదీరిన బ్రహ్మసూత్రం మరియు పానవట్టం వద్ద ఉన్న సోమసూత్రం ఇక్కడి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. శివలింగంపై నిలువుగా ఉండే బ్రహ్మసూత్రం పరబ్రహ్మ తత్త్వానికి సూచిక కాగా, దీనిని దర్శించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగి జీవితంలోని అజ్ఞానం, అడ్డంకులు తొలగిపోతాయని పండితులు వెల్లడించారు. అలాగే అభిషేక జలధార ప్రవహించే సోమసూత్రం దేవీ శక్తికి, అమృతత్వానికి ప్రతీక కాగా, ఈ సోమసూత్ర దర్శనభాగ్యంతో సమస్త పాపాలు, రుగ్మతలు తొలగిపోయి ఆయురారోగ్యాలు, సంతాన సౌభాగ్యాలు సిద్ధేస్తాయని అర్చకులు తెలిపారు.
నాగావళి నదీస్నానం, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మ, సోమసూత్రాల దివ్య దర్శనం భక్తులకు అనంతమైన పుణ్యఫలాన్ని, మనశ్శాంతిని చేకూరుస్తుందని క్షేత్ర పండితులు పేర్కొన్నారు.
0 Comments