(మండపాక రాంగోపాల్.. సీనియర్ సబ్ ఎడిటర్)
సవర రాజుల కులదేవతగా కొలువైన అమ్మవారు.. కోటలో వెలసిన స్వయంభూ శక్తి
పునఃప్రతిష్ఠ నుంచి నేటి నవరాత్రుల వరకు కొనసాగుతున్న ప్రత్యేక ఆచారాలు ఘటాల సమర్పణ, ముర్రాటలు, బిందె దీపాలు, తిరువీధి.. భక్తి–జానపద సంప్రదాయాల అపూర్వ సంగమం
*****
16వ శతాబ్దంలో జైపూర్ రాజుల పాలనలో సామంత రాజులుగా "వీరబాహు" బిరుదుతో రాజ రాజ నరేంద్ర రాయుడు అనే సవర రాజుల పాలకొండ పాలించబడేది. ఆ తదుపరి వారి కోటలో వారు కొలుచుకునే "దుర్గ" దేవత వారి కులదేవతగా కొలువైన అమ్మవారు..ఈ కోటదుర్గమ్మ. ఆ తదుపరి పరిణామాలతో రాజుల క్షీణత, జమిందారుల దురలవాటులతో, సోమరిపాటుతనంతో, దివానుల తిరుగుబాటులతో పాలకొండ సంస్థానం పూర్తిగా క్షీణించి 1846 ప్రాంతంలో "ఆర్బాత్ నాట్" కంపెనీ స్వాధీనంలోకి వచ్చింది. కోటలు, నివాసస్థలాలు శిధిలమైయ్యాయి.
సుమారు వందేళ్ళు తరువాత 1945-47 ప్రాంతంలో ఒడిస్సా నుంచి శ్రీ కృష్ణ వల్లభ దాసు అనే భక్తుడి రాకతో మర్రిచెట్టు నీడలో సున్నపు గవ్వల నిర్మాణ శైలి వున్న ఓ చిన్న ప్రాకారం ఉన్న ఆ అమ్మ వారి రూపాన్ని కటక్ శిల్పులను రప్పించి
పునఃప్రతిష్ఠ చేసారు. బ్రహ్మచారి అయిన కృష్ణ వల్లభ దాసు తన అన్న కుమారుడు, దత్త పుత్రుడు అయిన కృపాసింధు దాసు ను రప్పించి ఆలయ బాధ్యతను అప్పగించారు. ఆతను పాలకొండ వాసుల సహకారంతో అమ్మవారికి ఆలయ నిర్మాణం చేయించి దిన దిన ప్రవర్ధనం కావించారు. ఆ నాటి నుంచి నేటి 2001 దసరా నవరాత్రుల వరకు ఆతని హయాంలో వైభవంగా కొనసాగి 2001 డిసెంబర్ 29 నుంచి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చి ఈ నాటి వరకు దసరా ఉత్సవాలు, సంప్రాదాయాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక చరిత్రలో పాలకొండ కోటదుర్గమ్మ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ పట్టణంలో ఉన్న ఈ ఆలయం కేవలం ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా.. ఈ ప్రాంత ప్రజల విశ్వాసం, రాజవంశాల చరిత్ర, గిరిజన సంస్కృతి, జానపద ఆచారాలు, దసరా ఉత్సవాల వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.
ప్రతి ఏడాది శరన్నవరాత్రుల సమయంలో జరిగే ఉత్సవాలకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలతో పాటు ఒడిశా మరియు ఇతర రాష్ట్రల భక్తులు రావటం, కొలవటం విశేషం.
ఒకప్పుడు సవర (జాతపు) రాజవంశానికి కులదేవతగా ఉన్న ఈ అమ్మవారు ,కోటలో కొలువైన అమ్మవారిగా ‘కోటదుర్గమ్మ’గా ప్రసిద్ధి చెందింది. మట్టిపొరలలో కలిసిపోయిన ఆ అమ్మవారి విగ్రహ పునరుద్ధరణ 1945-47లలో జరిగినట్లు , ఆ తదుపరి సంవత్సరాలలో దిన దిన ప్రవర్ధనమై ఆలయం తయారి జరిగినట్టు సమాచారం.
స్థలపురాణం..
కోటలో వెలసిన శక్తి
పాలకొండ కోటదుర్గమ్మ పూజలు, ఆరాధనలు తెలుగు, వుత్కాళ సంస్కృతిలో కొనసాగటం విశేషం. అర్చనలు స్థానిక ప్రజల విశ్వాసాలతో ముడిపడి ఉంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారు రాజ కుటుంబానికి అమ్మవారు ఆరాధ్యదైవంగా ఉన్నప్పటికీ సాధారణ ప్రజల మన్నలతో అందరి అమ్మవారుగా మారటం, పూజలు అందుకోవటం ఆ దైవ లిఖితం.
అధికారిక జిల్లా వెబ్సైట్ కూడా ఒకప్పుడు ఆమె సవర రాజవంశానికి కులదేవతగా ఉన్నట్లు, ఆలయం కోటలో ఉండటంతో కోటదుర్గమ్మగా ప్రసిద్ధి చెందినట్లు పేర్కొంటోంది. ఆలయం పాలకొండ జమీందారుల పాలనకు కూడా సాక్ష్యంగా నిలిచిందని జిల్లా అధికారిక సమాచారం చెబుతోంది.
రాజదేవత నుంచి ప్రజాదేవత వరకు
కోటదుర్గమ్మ ఆరాధన మారినప్పటికీ, ప్రతి దసరా నవరాత్రుల రోజులలో, చివరి ఆనుపు పండగకు పరిసర ప్రాంత సవరలు, జాతపు తెగవారు వచ్చి పాల్గోనటం చరిత్ర విశేషం అని చెప్పవచ్చు.
సవర రాజుల సంప్రదాయానికి ప్రత్యేకస్థానం ఉంది. పూర్వకాలంలో రాజ కుటుంబ సభ్యులే పూజించినా ఇప్పుడు ప్రజల ఆరాధ్యదైవంగా మారింది ఈ కోటదుర్గమ్మ.
కాలక్రమంలో రాజరిక వ్యవస్థలు కనుమరుగయ్యాయి. కోట ప్రాధాన్యం తగ్గింది. అయినప్పటికీ అమ్మవారి పట్ల భక్తి మాత్రం కొనసాగింది. ఒక దశలో ఆలయానికి ఆదరణ తగ్గినప్పటికీ, భక్తుల విశ్వాసం ద్వారా మళ్లీ పూజా సంప్రదాయాలు పునరుద్ధరించబడ్డాయని స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి.
ఇక్కడే కోటదుర్గమ్మ ఆరాధనలో ఒక ముఖ్యమైన సామాజిక పరిణామం కనిపిస్తుంది. ఒకప్పుడు రాజ కుటుంబానికి పరిమితమైన ఆరాధన క్రమంగా సామాన్య ప్రజల ఆరాధనగా మారింది. నేడు కుల, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా వేలాది మంది అమ్మవారిని దర్శించుకోవడం ఈ పరిణామానికి నిదర్శనం.
పునఃప్రతిష్ఠ..
మళ్లీ వెలుగులోకి వచ్చిన అమ్మవారు.
కోటదుర్గమ్మ ఆలయ చరిత్రలో పునఃప్రతిష్ఠ ఘట్టానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఒక స్థానిక చారిత్రక కథనం ప్రకారం 1945-47లలో ఒడిశాకు చెందిన భక్తుడు కృష్ణ వల్లభ దాసుకు స్వప్న దర్శనం కలగడంతో అమ్మవారి శిలామూర్తులు వెలికితీయబడ్డాయని, అనంతరం పూజలు తిరిగి ప్రారంభమయ్యాయని పేర్కొంటోంది. తరువాత ఒడిశా (కటక్) శిల్పుల చేత ప్రస్తుత విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు ఆ కథనం వివరిస్తోంది.
అయితే ఈ వివరాలను చారిత్రక ఆధారాలతో పూర్తిగా నిర్ధారించబడిన వాస్తవాలుగా కాకుండా స్థానిక ఆలయ చరిత్ర–ఆతని వారసుడు కృపాసింధు దాసు చేసిన కృషి చరిత్ర కోణం లో చూడాలి. అధికారిక జిల్లా వెబ్సైట్ మాత్రం ఆలయం 1947లో పునరుద్ధరించబడినట్లు స్పష్టం చేస్తోంది.
ఈ రెండు అంశాలను కలిపి చూస్తే.. కోటదుర్గమ్మ క్షేత్రం ఒక దశలో నిర్లక్ష్యానికి గురైనా, అనంతరం భక్తుల కృషి, పునరుద్ధరణల ద్వారా తిరిగి ప్రజా ఆధ్యాత్మిక జీవితంలో ప్రధాన స్థానాన్ని సంపాదించిందని చెప్పవచ్చు.
దసరా ఉత్సవాలు..
ప్రతి ఏడు దసరా ఉత్సవాలు జరిగినప్పటికీ 1971 నుండి మోటారు వర్కర్స్ నాయకులు భాసూరు రామారావు ఉత్సవాలలో భాగం కావటం, మోటారు కార్మికులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గోనటం కోటదుర్గమ్మ దసరా ఉత్సవాలకు మరింత శోభను తెచ్చాయి.
ఏడాదికి ఒక్కసారి నవరాత్రుల మొదటిరోజు అమ్మవారి నిజరూప దర్శనం
కోటదుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రత్యేకమైన సంప్రదాయం అమ్మవారి తెరచాటు. ఉత్సవాల ముందు మూలవిరాట్టుకు సంప్రదాయ రంగులతో ప్రత్యేక పూత పూయడం, కొంతకాలం అమ్మవారిని తెరచాటున ఉంచడం జరుగుతుందని, ఆ తెరచాటు కాలంలో పాంచతనయాలను మాత్రం ఆరాధించటం స్థానిక వార్తా కథనాలు పేర్కొంది. ఆ సమయంలో భక్తులకు ఉత్సవ విగ్రహం ద్వారా దర్శనం కల్పిస్తారు. ఆ సాయింత్రం అమ్మవారిని యధావిధిగా అలంకరించుతారు. ఈ రోజువారి అలంకరణ శిక్షణకై కృపాసింధు దాసు ను 2002 నుంచి 2005 వరకు ఏకసభ్య ధర్మకర్తగా ప్రభుత్వం నియమించటం విశేషం.
నిజ రూప దర్శనం
కోటదుర్గమ్మ దసరా ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణ. సంవత్సరంలో ఒక్కసారి అమ్మవారి నిజరూప దర్శనం లభిస్తుందన్న విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. స్థానికంగా ఈ దర్శనానికి ఎంతో పవిత్రతను ఆపాదిస్తారు.
నిజరూప దర్శనం అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక ఘట్టం కాదు. ఏడాది పొడవునా అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తుల విశ్వాసానికి అది పరాకాష్ఠ. అందుకే ఆ రోజుల్లో పాలకొండ పట్టణం పూర్తిగా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది.
ఘటాల అర్పణ.. మొక్కుబడికి ప్రతీక
కోటదుర్గమ్మ దసరా ఉత్సవాల్లో ఘటాల సమర్పణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నవరాత్రుల్లో స్థానిక భక్తులు నిర్ణీత రోజుల్లో అమ్మవారికి ఘటాలు, ముర్రాటలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందని స్థానిక వార్తా కథనం పేర్కొంటోంది. ఘటాలతో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆలయ అధికారులు గత ఉత్సవాల్లో వెల్లడించారు. ఈ సంవత్సరం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూన్నట్లు ఆలయ కమిటీవారు తెలిపారు.
ఘటం సాధారణంగా శక్తి, సంపద, సంతానం, పంటలు, ఆరోగ్యం వంటి శుభాభిలాషలకు ప్రతీకగా భావించే భారతీయ పూజా సంప్రదాయంలో ముఖ్యమైన అంశం. స్థానిక గ్రామదేవతల ఉత్సవాల్లో మహిళలు అలంకరించిన ఘటాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం విస్తృతంగా కనిపించే జానపద సంప్రదాయం.
పాలకొండలోనూ ఘటాల సమర్పణ భక్తుల వ్యక్తిగత మొక్కుబడితో పాటు సామూహిక ఆధ్యాత్మిక అనుభూతిగా మారుతుంది. ఘటాన్ని అలంకరించడం, పూజించడం, ఊరేగింపులో అమ్మవారి వేషధారులతో తీసుకురావడం, అమ్మవారి సన్నిధిలో సమర్పించడం వంటి చర్యలన్నీ భక్తి వ్యక్తీకరణకు రూపాలుగా నిలుస్తాయి.
పవిత్రమైన పసుపుతో చేసే ముర్రాటలు, బిందె దీపాలు ప్రత్యేక ఘటాలతో.. స్థానిక భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవటం ఆచారం.
ముర్రాటలు, ఘటాలు వంటి ఆచారాలను కేవలం పూజా విధానాలుగా కాకుండా ఉత్తరాంధ్ర ప్రజా సంస్కృతిలోని జానపద విశ్వాసాల ప్రతిబింబంగా చూడవచ్చు. కుటుంబ క్షేమం, ఆరోగ్యం, పంటల అభివృద్ధి, పిల్లల శ్రేయస్సు, కోరికల నెరవేర్పు కోసం భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాస వ్యవస్థలో భాగం.
బిందె దీపాలు.. వెలుగుతో మొక్కుబడి
కోటదుర్గమ్మ ఉత్సవాల్లో స్థానికంగా చెప్పుకునే మరో భక్తి ఆచారం ఈ బిందె దీపాలు నీటితో నింపి ఆ పైన నూనెతో వెలిగించటం ఈ తరానికి తెలియని ఓ క్రొత్తదనం. దీపం భారతీయ శక్తి ఆరాధనలో జ్ఞానం, శుభం, రక్షణకు ప్రతీక. బిందె లేదా పాత్రలో దీపాన్ని వెలిగించి అమ్మవారి సన్నిధిలో సమర్పించడం భక్తులు తమ మొక్కుబడిని వ్యక్తం చేసే విధానంగా భావిస్తారు.
అయితే బిందె దీపాల ప్రత్యేక విధానం. కొంతమంది భక్తులు ఒక్కరోజు నిమిత్తం, మరి కొంతమంది తొమ్మిది రోజులు వుంచటం వారి వారి భక్తి విశ్వాసాల ప్రతీక. అందువల్ల దీనికి నిర్దిష్టమైన ఆచార నియమాలను చారిత్రక వాస్తవాలుగా పేర్కొనడం కంటే, స్థానిక భక్తి సంప్రదాయంగా చూడటం సముచితం.
నిత్యపూజలు.. నిరంతరం కొనసాగే ఆరాధన
దసరా ఉత్సవాలు ఏడాదిలో ఒకసారి జరిగే మహోత్సవం అయినప్పటికీ, అమ్మవారి ఆరాధన మాత్రం నిత్యకృత్యం.
ప్రతిరోజూ ఆలయంలో సంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాలు, నైవేద్యం, హారతులు, అలంకరణ వంటి ఆరాధనా విధానాలు కొనసాగుతాయి. దసరా సమయంలో వీటికి అదనంగా ప్రత్యేక అలంకరణలు, ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నిత్యపూజలు ఒక ఆలయానికి ఆధ్యాత్మిక నిరంతరత్వాన్ని ఇస్తాయి. దసరా వంటి భారీ ఉత్సవం ముగిసిన తర్వాత కూడా అమ్మవారి సన్నిధిలో భక్తి జీవితం కొనసాగడానికి అవే ఆధారం.
తిరువీధి.. అమ్మవారు భక్తుల మధ్యకు
కోటదుర్గమ్మ దసరా ఉత్సవాల్లో తిరువీధి మరో ప్రధాన ఘట్టం. ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పాలకొండ పట్టణంలోని వీధుల్లో ఊరేగించడం, ఆ ఉరేగింపుల భాగంగా బళ్ళ వేషాలు, గిరిజన సంప్రదాయ డప్పు, సన్నాయి బృందాలు, ప్రత్యేక మందుగుండ వెలుగులు, నృత్య బృందాలు, బ్యాండ్ మేళాలు, కోయి వేషాలు, పులి వేషధారుల విన్యాసాలు ఈ ఉరేగింపు సంప్రదాయంలో భాగం. అమ్మవారు ఆలయ గర్భగుడిలో మాత్రమే కాకుండా భక్తుల మధ్యకు వచ్చి ఆశీర్వదిస్తున్నారనే భావన తిరువీధి ఉత్సవానికి ఆధ్యాత్మిక అర్థాన్ని ఇస్తుంది.
స్థానిక కథనాల ప్రకారం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలోని పలు వీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి నామస్మరణ చేస్తారు.
తిరువీధి కేవలం ఊరేగింపు కాదు. ఇది పట్టణ సమాజాన్ని ఒకచోట చేర్చే సామూహిక ఉత్సవం. వృద్ధులు, మహిళలు, పిల్లలు, యువత.. అందరూ పాల్గొనే ఈ కార్యక్రమం పాలకొండ సామాజిక జీవితంలోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
ఇవి కేవలం వినోద కార్యక్రమాలు కావు. ఉత్తరాంధ్రలోని ప్రజా సంస్కృతి, గిరిజన జీవన విధానం, దేవతా ఆరాధన మధ్య ఉన్న అనుబంధాన్ని అవి ప్రతిబింబిస్తాయి. ఆలయ ఉత్సవం ఒకవైపు శాస్త్రీయ పూజా విధానాలను కొనసాగిస్తూనే.. మరోవైపు జానపద కళలను కూడా తనలో కలుపుకోవడం కోటదుర్గమ్మ ఉత్సవాల ప్రత్యేకత.
నవరాత్రులలో ప్రతిరోజూ ప్రత్యేక వేదికపై హరికథ, బుర్రకథ, పౌరిణిక డ్రామా, పద్య నాటకం, ఆధునిక సంగీత బృందగానం ప్రదర్శనలు వుంటూ చివరి రోజు అమ్మవారి కి ప్రీతిపాత్రమైన భామాకలాపం, భాగవత రూపకం, యక్షిణీ గానం ప్రదర్శించటం కళా సంప్రదాయానికి మరో కోణం ప్రత్యేకతగా ఉంది. ఇది ఉత్సవాల్లోని జానపద–రంగస్థల కళా సంప్రదాయాన్ని ప్రతిబింబించే అంశంగా చెప్పవచ్చు.
అమ్మవారి ఆరాధన చుట్టూ సంగీతం, నృత్యం, వేషధారణ, కథనం వంటి కళారూపాలు కలవడం వల్ల ఈ ఉత్సవం ఒక సమగ్ర సాంస్కృతిక వేడుకగా మారుతుంది.
భక్తుల ప్రవాహం.. ఉత్తరాంధ్రకు ఆధ్యాత్మిక కేంద్రం
కోటదుర్గమ్మ దసరా సమయంలో స్థానికులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, ఒడిశా , తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. నిజరూప దర్శనానికి వేలాది మంది తరలివస్తారని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ నిర్వహణకు కూడా కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. క్యూలైన్లు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స, ఘటాలతో వచ్చే భక్తులకు ప్రత్యేక మార్గాలు వంటి మౌలిక వసతులపై గతంలో అధికారులు, ప్రత్యేక కమిటీ వారు దృష్టి పెట్టారు.
భక్తుల విశ్వాసం ఎంత బలంగా ఉందో ఈ రద్దీ తెలియజేస్తుంది. అదే సమయంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పాలకొండను అభివృద్ధి చేయడానికి కూడా ఇది అవకాశాన్ని కల్పిస్తోంది.
సంప్రదాయ పరిరక్షణే అసలు సవాలు
కోటదుర్గమ్మ దసరా ఉత్సవాల గొప్పతనం వాటి వైభవంలో మాత్రమే లేదు. తరతరాలుగా వస్తున్న స్థానిక ఆచారాలు, ఘటాల సమర్పణ, ముర్రాటలు, బిందె దీపాలు, తిరువీధి, గిరిజన నృత్యాలు, పౌరాణిక వేషధారణలు వంటి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం మరింత ముఖ్యమైన విషయం.
ఆధునిక సాంకేతికత, పెరుగుతున్న భక్తుల రద్దీ, మారుతున్న జీవన విధానాల మధ్య ఈ సంప్రదాయాల అసలు స్వరూపం దెబ్బతినకుండా చూడాలి. ప్రతి ఆచారం వెనుక ఉన్న స్థానిక చరిత్రను నమోదు చేయాలి. పెద్దల నుంచి యువతకు ఆ సంప్రదాయాలను వివరించాలి. ఆలయ చరిత్ర, పూజా విధానాలు, ఉత్సవ క్రమం, జానపద కళలను అందిస్తూ చేస్తే కోటదుర్గమ్మ దసరా ఉత్సవాలు చరిత్ర గా మార్చాలి.
ముగింపు.. భక్తి నుంచి సాంస్కృతిక వారసత్వం వరకు
పాలకొండ కోటదుర్గమ్మ క్షేత్రం ఒక ఆలయం మాత్రమే కాదు. ఇది సవర రాజుల ఆరాధనా సంప్రదాయానికి గుర్తు.. పాలకొండ కోట చరిత్రకు సాక్ష్యం.. ఉత్తరాంధ్ర జానపద సంస్కృతికి వేదిక.. దసరా ఉత్సవాల సామూహిక చైతన్యానికి కేంద్రం.
తెరచాటు నుంచి నిజరూప దర్శనం, నవరాత్రుల నిర్వహణ వరకు..
ఘటాల అర్పణ నుంచి ముర్రాటల వరకు.. బిందె దీపాల నుంచి నిత్యపూజల వరకు.. ఆలయం నుంచి తిరువీధిలో భక్తుల మధ్యకు అమ్మవారి ఉత్సవమూర్తి రావడం వరకు ప్రతి ఘట్టంలో ఒక ప్రత్యేకమైన భక్తి భావన కనిపిస్తుంది.
సాధరణంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రజల విడివిడిగా నిర్వహిస్తున్నప్పటికీ పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఉత్సవం పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్ళు గా ఒకటిగా నిర్వహించడం గొప్ప విశేషం అని చెప్పొచ్చు.
అందుకే కోటదుర్గమ్మ దసరా ఒక పండుగ మాత్రమే కాదు.. చరిత్ర, భక్తి, జానపదం, గిరిజన సంస్కృతి, కుటుంబ విశ్వాసం, సామూహిక జీవన విధానం కలిసిన సజీవ వారసత్వం. ఈ వారసత్వాన్ని సంరక్షించడం పాలకొండ ప్రజలకే కాకుండా ఉత్తరాంధ్ర సాంస్కృతిక చరిత్రను కాపాడే బాధ్యతగా అందరూచూడాలి.
(మండపాక రాంగోపాల్.. సీనియర్ సబ్ ఎడిటర్)
0 Comments