పాలకొండ, నవంబర్ 19: పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని సాయి దుర్గ నగర్‌కు చెందిన బాసూరు శివ శంకర ప్రసాద్ రచించిన 'పాలకొండ పంచ శివలింగ వైభవం శివ క్షేత్ర దర్శనం' పుస్తకాన్ని పట్టణ ప్రముఖులు బుధవారం ఆవిష్కరించారు. ఈ ఆధ్యాత్మిక గ్రంథం పాలకొండలోని పంచ శివలింగాల పూర్తి వివరాలను, స్థల పురాణాలను వివరిస్తుంది. స్థానిక శ్రీ జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో గల ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి విశ్రాంత గ్రంథాలయ అధికారి కనపాక చౌదరి నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు గంట సంతోష్ కుమార్, వ్యాపారవేత్త నందాన సుధాకర్, జవహర్ నవోదయ విద్యాలయ విశ్రాంత హిందీ అధ్యాపకులు తుమరాడ జగన్నాథశాస్త్రి పాల్గొని మాట్లాడారు. చౌదరి నాయుడు మాట్లాడుతూ, పాలకొండలో వెలసిన పంచ శివలింగాల గురించిన పూర్తి వివరణ, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. గంట సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే ఈ శివలింగ దర్శనం పుస్తకం అందరూ తప్పక చదవాల్సినదని, పాఠకులకు జ్ఞానజ్యోతిని వెలిగించి, సన్మార్గం వైపు నడిపించేలా ఉందని కొనియాడారు. నందన సుధాకర్ సైతం అద్భుత శైవక్షేత్రాల వైభవం గురించి చక్కటి వివరణ అందించిన రచయితను అభినందించారు. తుమరాడ జగన్నాథ శాస్త్రి మాట్లాడుతూ, పాలకొండలోని శివలింగముల స్థల పురాణము, ఇతిహాసము, చరిత్రలను రచయిత చాలా వివరంగా, భక్తుల మనసులకు హత్తుకునేలా విశ్లేషణ చేశారని తెలిపారు. ఈ గ్రంథం ప్రామాణికంగా, అత్యంత జ్ఞానదాయకంగా, భక్తి ప్రదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. పుస్తక రచయిత బాసూర్ శివ శంకర ప్రసాద్ కృషిని పలువురు ప్రశంసించారు. నగర పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ కొండదాడి చిట్టి నాన్నలు మాట్లాడుతూ ఇటువంటి ఆధ్యాత్మికతతో కూడిన పుస్తకాలు మరిన్ని రాయాలని ఆకాంక్షించారు. పాలకొండలోని అన్ని క్షేత్రాలను పుస్తక రూపంలో తీసుకురావాలని ఈ సందర్భంగా అల్లెన వెంకటరమణమూర్తి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు వావిలపల్లి గోవిందరావు, సీనియర్ న్యాయవాది టి. సింహాచలం, అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు, పక్కి గంగాధర్ రావు, దుంపల రమేష్ బాబు (చిన్ని) బాసూరు శ్రీనివాసరావు, బొడ్డేపల్లి వెంకటరమణ, తుంబలి వాసుదేవరావు. బెహరా గోవర్ధన్, కోరాడ లక్ష్మణరావు, పాత్రికేయులు బి.వి. రమణ, కొండదాడి రమేష్, సూర్య రవణ, రేగుల వలస సురేష్, కె.వి. రమణ, బట్న రవి, పురోహితులు మఠం గాసిదాస్, మఠం చక్రి, తదితరులు పాల్గొన్నారు.

0 Comments