మన సంస్కృతికి, భక్తికి నిలువుటద్దం పాలకొండలోని పురాతన శ్రీ సీతారామస్వామి దేవస్థానం. సుమారు 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ క్షేత్రం భక్తుల పాలిట కల్పవృక్షంలా విరాజిల్లుతోంది. నాటి పాలకొండ జమీందారు శ్రీ వెంకటరాయుడు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఒక కోనేరును తవ్వించారు. ఆ తవ్వకాల్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపంగా లభించిన విగ్రహాలే నేటి ఈ పుణ్యక్షేత్రానికి మూలవిరాట్టులు.
అద్భుత పురాణ గాథ
జమీందారు గారికి ఇష్టదైవమైన శ్రీ సీతారాముల పేరు మీదనే ఈ ఆలయాన్ని నిర్మించారు. కోనేరుకు పడమటి దిశలో కొలువై ఉన్న ఈ స్వామివారి దర్శనం సకల కార్యసిద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రస్తుతం ఆర్టీసీ కాంప్లెక్స్ ఉత్తర దిశలో ఉన్న ఈ కోనేరు గట్టుపైనే ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా డోలోత్సవం నిర్వహిస్తారు.
ఉత్సవాల పురిటిగడ్డ
ఈ ఆలయంలో శ్రీరామనవమి వసంత నవరాత్రులు అత్యంత వేడుకగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవాలు, ధనుర్మాస పూజలు భక్తజన సందోహం మధ్య నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, దాసాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం ఒక మధుర అనుభూతిని మిగిలిస్తుంది.
తరతరాల భక్తి సేవ
చామర్తి వంశీయులు గత ఎనిమిది తరాలుగా స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఆలయ వారసత్వ సంపదలో భాగమైన శేష వాహనాన్ని, శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను సుమారు 200 ఏళ్ల క్రితం చౌదరి జగన్నాథం గారు సమర్పించారు. ఈ చారిత్రక ఆధారాలు నేటికీ ఆ కాలపు భక్తి వైభవానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంలా వెలుగొందుతున్న ఈ సీతారాముల ఆలయాన్ని దర్శించి పునీతులు అవ్వండి.
సీతారామచంద్రుని దివ్య దర్శనం: భక్తుల తన్మయత్వం ఆధ్యాత్మిక సౌరభాలకు నెలవైన పాలకొండ పట్టణంలో కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి వారి ఆలయం భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతోంది. గర్భాలయంలో వెలిసిన స్వామివారి రూపం భక్తులకు కనువిందు చేస్తోంది.
"రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే | రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||"
ఈ పవిత్ర క్షేత్రంలో అడుగుపెట్టగానే వినిపించే రామనామ జపం, సీతారాముల మంగళ రూపం ఒక వైకుంఠాన్ని తలపిస్తాయి.
.. బి శివ శంకర ప్రసాద్..
0 Comments