వెలిగింది జ్ఞానజ్యోతి... తొలగింది అంధకారం....

పాలకొండ వెబ్ న్యూస్:
పాలకొండ: పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన లలితా మహా త్రిపుర సుందరీ సమేత అమృత మృత్యుంజయ స్వామి వారి ఆలయం ఆదివారం రాత్రి శివనామస్మరణతో మార్మోగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని, ఆలయ ధర్మకర్త కొండబాబు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన అర్చకులు శరత్, సహాయ అర్చకులు అనంత్, ఆకాష్ వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేకంగా అష్టోత్తర శతనామ పూజలు, పంచామృతాభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ పుణ్యకార్యక్రమంలో దీపాలు వెలిగించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వెలిగించిన వేలాది దీపాలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగింది. భక్తులు భక్తిపారవశ్యంతో "ఓం నమః శివాయ" అంటూ చేసిన జయజయ ధ్వానాలు, వేదమంత్రాల ఘోషతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మారుమ్రోగాయి.

Post a Comment

0 Comments